అతడు, ఆమె... పరుగెడుతున్నారు.వూరించే లక్ష్యాల దిశగా పరుగెడుతున్నారు. ఉద్యోగాలు, మరింత మంచి ఉద్యోగాలు, జీతాలు, ఇంకా ఎక్కువ జీతాలు, ప్రాజెక్టులు, డెడ్‌లైన్లు... అన్నింటినీ దాటుకుంటూ పరుగెడుతున్నారు.
అలసిపోయినా ఆయాసం వచ్చినా ఆగడం లేదు. రాత్రీపగలూ అదే పరుగు, ఒకే ధ్యాస.పడకగదిలోనూ పరధ్యానమే. జీవితభాగస్వామి చెక్కిలిపైనో, నడుము వంపులపైనో నాట్యం చేయాల్సిన వేళ్లు... లాప్‌టాప్‌పై నీరసంగా కదులుతుంటాయి.
'రేయి ఆగిపోనీ' అని కోరుకున్నా అది ప్రణయ కవిత్వం కాదు. రేపంటే భయం. డెడ్‌లైన్ ఫోబియా!
ఈ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో శృంగారం ఓ కేళీ విలాసం కాదు, రెండు హృదయాల సంగమం అసలే కాదు. నెలనెలా కరెంటుబిల్లు కట్టినట్టు... ఓ వెుక్కుబడి వ్యవహారం! ఈ ధోరణి పోవాలంటున్నారు వైద్యులు. సెక్స్ ఓ ఆనందమే కాదు, అదో ఔషధం అని ప్రచారం చేస్తున్నారు. 'ఆరోగ్యానికి శృంగారం' అంటూ నవతరం దంపతుల్ని ప్రోత్సహిస్తున్నారు..
భరించలేని తలనొప్పా... ఓ చిట్కా ఉంది, పాటిస్తే క్షణాల్లో నొప్పిమాయం... అదేమిటో తెలుసా?
బరువు పెరుగుతోందా... డైటింగ్ తప్ప ఇంకేదైనా చేస్తారా... శ్రమనిపించినా భలే హుషారైన వ్యాయామం ఒకటుంది... చెప్పమంటారా?
ఏమిటీ, పక్కింటి అమ్మాయి మిమ్మల్ని 'ఆంటీ' అంటోందా... మీ వయసు నలభైకి అటూ ఇటేగా, అప్పుడే ఆ పిలుపేమిటి... సరే, ఓ పని చేయండి. ఓ ఐదారేళ్లు చిన్నవాళ్లయిపోతే సరి... ఎలాగంటారా?
ఆఫీసులో మరీ పనెక్కువైందా... ఒత్తిడితో సతమతమవుతున్నారా... ఏం ఫర్వాలేదు, ఒత్తిడి తగ్గించుకోండి... అదెలాగో చెప్పాలా?
ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే ఔషధం. అదే శృంగారం. శరీరానికే కాదు మనసుకూ శక్తినిచ్చే గోళీ. పడకగదే ఆసుపత్రి. జీవిత భాగస్వామే డాక్టర్, సైకాలజిస్ట్... అన్నీ! ఈ విషయాన్ని అంతర్జాతీయ వైద్య ప్రపంచం మరోమాట లేకుండా ఒప్పుకుంది. కానీ ఈ మందు గురించి, ఆ మహత్తు గురించి పట్టించుకునే తీరిక ఈ తరం దంపతులకు లేదు.
వారికి శృంగారం ఓ వెుక్కుబడి వ్యవహారం. వీకెండ్స్‌లో తీరికుంటే చూద్దామనుకునే ఓ వాయిదా కార్యక్రమం. నెట్ ఛాట్, వెుబైల్ బాతాఖానీ, టీవీ ప్రోగ్రామ్స్... మూడూ అయ్యాక ముగించామనిపించే ముక్తసరి ముచ్చట. 'సెక్స్... నవతరం దంపతుల ప్రాథమ్యాల్లో చివరిది' అంటున్నారు లైంగిక వైద్య నిపుణులు. ఈ మాటను అధ్యయనాలూ అంగీకరిస్తున్నాయి.
పాతిక నుంచి నలభై అయిదేళ్ల వయసున్న జంటల్లో సగానికిపైగా వారానికి ఒకటీ రెండుసార్లు మాత్రమే శృంగారంలో పాల్గొంటున్నారట! మిగతావారి పరిస్థితి అడగాల్సిన పనే లేదు.
ఓ సంస్థ వేయిమంది యువతీయువకుల్ని సర్వే చేస్తే వారిలో 70 శాతానికిపైగా 'ఒత్తిడి వల్లే సెక్స్‌కు దూరంగా ఉన్నాం' అని ఒప్పుకున్నారు. ఆతర్వాత పిల్లల బాధ్యతలు, ఇంటి పని, ఆరోగ్య సమస్యలు, నిరాసక్తత, కొత్తదనం లేకపోవడం, గర్భం వస్తుందన్న భయం... ఇంకేవో కారణాలు చెప్పారు.
ఈ భయాలతో భార్యాభర్తలమధ్య దూరం పెరుగుతోంది. అది శారీరకమే కాదు, మానసికమూ! ఆ ప్రభావం వృత్తి, వ్యక్తిగత జీవితాలపై కనిపిస్తోంది.
ఇంట్లో... ఆలూమగల మధ్య ఘర్షణలు, విడాకులు, వివాహేతర సంబంధాలు, ప్రాణాంతక రోగాలు.
ఆఫీసులో... పనిపై అశ్రద్ధ, గైరుహాజరీ తత్వం, తప్పులతడకల పనులు. ఇంతకు మించిన సంక్షోభం ఏముంటుంది?
ఈ నరకం నుంచి బయటపడాలంటే?
స్వర్గానికి... అదే పడకగదికి వెళ్లాల్సిందే. శృంగారంతో బతుకును బంగారం చేసుకోవాల్సిందే.
వాత్స్యాయనుడూ చెప్పని కొత్త సూత్రాలతో కొంగొత్త అనుభూతులను జుర్రుకోవాల్సిందే. ఎందుకంటే సెక్స్... ఓ అవసరం, ఓ ఆనందం... అంతకుమించి ఓ ఔషధం! ఈ విషయాన్ని ఆధునిక వైద్యశాస్త్రమూ గుర్తిస్తోంది. పరిశోధనలతో ఆ జ్ఞానాన్ని పరిపుష్టం చేస్తోంది. కొన్ని ఫలితాలైతే శాస్త్రవేత్తలనూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. కొత్త పరిశోధనలకు ఉసిగొల్పుతున్నాయి. 'అల్టిమేట్ సెక్స్ డైట్' పుస్తక రచయిత్రి కెర్రీ మెక్‌క్లోస్కీ అయితే 'నా దగ్గర చాలా రహస్యాలున్నాయి. వాటన్నిటినీ పంచుకుందాం రండి! అవి నా జీవితాన్ని మార్చేశాయి. ఎప్పుడూ లేనంత ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాన్నేను. అవన్నీ మీకు చెప్పేందుకే ఈ ప్రయత్నం' అని ముందుమాటలో రాసుకున్నారు. ఆమె సెక్స్ వల్ల కలిగే పది లాభాల్ని తన పుస్తకంలో ప్రస్తావించారు. శృంగార ఫలాల్లో అవి కొన్నే!
పెరట్లోని జామచెట్టుకు ఓ ఆకతాయి కుర్రాడు గురిచూసి రాయి విసురుతాడు. నాలుగు కాయలు రాలిపడతాయి. వాటిని ఏరుకుని 'అబ్బో ఎన్ని పడ్డాయో' అని మురిసిపోతాడు. కెర్రీ సంతోషమూ అలాంటిదే. ఆమె చెప్పిన పదే కాదు... శాస్త్రవేత్తలు గుర్తించినవీ గుర్తించాల్సినవీ ఎవరికివారే శోధించి సాధించాల్సినవీ ఇంకా చాలా ఉన్నాయి.
సెక్స్‌తో 'సెంచరీ'!
కొత్త జంటల్ని చిలకాగోరింకల్లా కలిసుంటూ నూరేళ్లు వర్ధిల్లమని ఆశీర్వదించడం వెనకా ఏదో లాజిక్ ఉందనిపిస్తోంది! ఎందుకంటే ఆ దీవెనకు ఆధునిక పరిశోధనలు బలాన్నిస్తున్నాయి. ఆలూమగలు హాయిహాయిగా శృంగార జీవితాన్ని గడుపుతుంటే... వందేళ్లు ఆరోగ్యంగా బతకడం కష్టమేం కాదంటున్నారు నిపుణులు. మూడున్నరవేల మందిపై చేసిన పరిశోధనలో సెక్స్‌కూ ఆయుఃప్రమాణానికీ సంబంధం ఉన్నట్టు అర్థమైపోయింది. సౌత్ వేల్స్‌లో దాదాపు వెయ్యిమంది నడివయసు వారిని పదేళ్లపాటూ పరిశీలించినపుడూ ఇవే ఫలితాలొచ్చాయి. సంతృప్తికర శృంగార జీవితమే 50 శాతం మంది ఆరోగ్యానికి కారణమని బ్రిటిష్ మెడికల్ జర్నల్ వెల్లడించిందిి. అంతేకాదు, కామకేళిలో తేలిపోతున్నపుడు విడుదలయ్యే కొన్ని రసాయనాలు చర్మంపైనా ప్రభావం చూపుతాయి. దీనివల్ల ఒంటికి మంచి నిగారింపు వస్తుంది. కొత్త మెరుపు కనిపిస్తుంది. వయసును గుర్తుచేసే ముడతలు మాయమైపోతాయి. చురుకైన శృంగార జీవితం గడుపుతున్నవారు మిగతావారికంటే కనీసం ఏడేళ్లు చిన్నవారిలా కనిపిస్తారని స్కాట్‌లాండ్‌లోని రాయల్ ఎడిన్‌బరో హాస్పిటల్ అధ్యయనంలో తేలింది.
ఒత్తిడి... హుష్‌కాకి!
ఒత్తిడి శృంగారానికి బద్ధశత్రువు. రెండూ ఒకచోట సర్దుకోలేవు. వాటిలో ఏదో ఒకటి ఉండాల్సిందే! ఆ ఉండేది శృంగారమే ఎందుకు కాకూడదు! ఆలూమగలు అనుకుంటే అదెంతపని! శృంగారానుభూతుల వల్ల విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్‌కు ఒత్తిడిని దూరం చేసే శక్తి ఉంది. ఈ 'మన్మథ హార్మోన్' భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని మరింత పదిలం చేయగలదట. ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే... మరుసటిరోజు అద్భుతంగా ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే ముందురోజు రాత్రి హుషారుగా శృంగారంలో పాల్గొంటే చాలట! అన్నిచోట్లా 'వన్స్‌వోర్'లే!
నొప్పి మటుమాయం
శృంగార మహత్యం తెలిసినవారెవరూ 'తలనొప్పిగా ఉంది...' అంటూ అనుభూతుల ఆటకు ఎర్రజెండా చూపరు. నిజంగా తలనొప్పి ఉన్నా దాన్ని క్షణాల్లో పోగొట్టే అమృతాంజనం సెక్స్! ఒక్క తలనొప్పే ఏం ఖర్మం, తల నుంచి పాదాల దాకా ఏ నొప్పులున్నా మటుమాయం కావాల్సిందే. భావప్రాప్తికి కాస్త ముందు మెదడులోని నొప్పిని నియంత్రించే కేంద్రం చురుగ్గా పనిచేస్తుంది. ఆ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లకు తలనొప్పి నుంచి కీళ్ల నొప్పులదాకా ఏ నొప్పినైనా మాయం చేసే శక్తి ఉంది. జలుబుతో చికాకుపడుతున్నవారికీ ప్రణయమే మందని చెబుతున్నారు అమెరికాలోని విల్కీస్ యూనివర్సిటీ పరిశోధకులు. సెక్స్‌లో చురుగ్గాపాల్గొనే వారిలో ఇమ్యునోగ్లోబులిన్-ఎ అనే యాంటీ బాడీ 30 రెట్లు అధికంగా ఉంటుంది. దీని ప్రభావం వల్ల రోగనిరోధకత అధికం అవుతుంది.
సెక్సర్‌సైజ
ఇంతకు మించిన వ్యాయామం లేదు. శృంగారం పతాకస్థాయిలో ఉన్నపుడు నాడి నిమిషానికి 70 నుంచి 150 సార్లు కొట్టుకుంటుందట. ఓ క్రీడాకారుడు తన శక్తినంతా ఉపయోగించినపుడే పల్స్‌రేట్ ఆ స్థాయిలో ఉంటుంది. ఇక కండరాల కదలికా చురుగ్గా ఉంటుంది. సెక్స్‌లో విడుదలయ్యే టెస్టోస్టెరాన్ కండరాలకూ ఎముకలకూ శక్తినిస్తుంది. ఊబకాయులు సన్నబడటానికి ప్రణయమూ ఓ మార్గమే. రోజూ ఒక కిలో మీటరు పరుగెత్తడవో, ఓసారి శృంగారంలో పాల్గొనడవో... ఈ రెండింటిలో ఏది కావాలో వారే నిర్ణయించుకోవచ్చు. అంతెందుకు, ఒక్కసారి గాఢంగా ముద్దుపెట్టుకుంటేనే 6.4 క్యాలరీలు ఖర్చవుతాయట. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే 'మెన్స్ హెల్త్ మ్యాగజైన్' పడకగదిని మించిన వ్యాయామశాల లేదని తేల్చేసింది. 'అల్టిమేట్ సెక్స్ డైట్' అనే పుస్తకంలో సెక్సర్‌సైజుల ప్రస్తావనా ఉంది. అవధుల్లేని శృంగార జీవితానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా అందులో రాశారు.
మీరు శృంగార రసానుభూతుల్లో తేలిపోతుంటే...ఎవరింట్లోనో చికెన్ బిర్యానీ వండుతున్న వాసన మీ ముక్కుపుటాల్ని తాకుతోందా? ప్రణయానికీ వాసన గ్రహించే శక్తికీ సంబంధం ఉంది. శృంగారం వల్ల శరీరంలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దాని ప్రభావం వల్ల మన ఘ్రాణశక్తి మరింత పెరుగుతుందట!
అనురాగ బంధం
సంసార జీవితం శృంగారంతో పరిపూర్ణం. పడకగదిలో హద్దులు దాటే ప్రణయావేశం... ఆలూమగల అనుబంధాన్ని ఘాటైన చుంబనంలా మరింత ప్రగాఢం చేస్తుంది. బిగి కౌగిలిలా ఇంకా బలోపేతం చేస్తుంది. ఇక హార్మోన్లూ వాటి పాత్ర అవి నిర్వర్తిస్తాయి. ఆక్సీటోసిన్ వారిద్దరిమధ్యా ఉన్న అనురాగాన్ని పదిరెట్లు పదిలం చేస్తుంది. 'నాకు నువ్వు... నీకు నేను' అన్న భావన బలపడేది పడకగదిలోనే. 'ఇదో గొప్ప భావవ్యక్తీకరణ' అంటారు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన క్లినికల్ సైకాలజిస్టు జాన్ మ్యారో.
ప్రవోషన్లు... ఇంక్రిమెంట్లు!
ఇంట్లో పరిపూర్ణ శృంగారాన్ని అనుభవిస్తున్నవారే ఆఫీసులో చక్కగా పనిచేస్తారు. చిటపటలాడకుండా చిరునవ్వుతో మెలుగుతారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. ప్రవోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ వారికే. ఇది ఓ అమెరికన్ సంస్థ పరిశోధన ఫలితం. సెక్స్‌కు దూరంగా ఉండేవారిలో ఓరకమైన అశాంతి కనిపిస్తుంది. అది వారిని స్థిమితంగా ఉండనీదు. ప్రశాంతంగా పని చేయనీదు. ముఖ్యంగా నైట్‌షిఫ్ట్ ఉద్యోగాల్లో ఉండేవారిలో ఈ తేడా గమనించవచ్చు. అందుకే సైకాలజిస్టులు 'మనిషి విజయం పడకగదితో వెుదలవుతుంది' అంటారు.
స్వాగతించండి!
'పోటీ ప్రపంచంలో పరుగులు పెట్టాల్సిందే. లక్ష్యాల్ని అందుకోవాల్సిందే. కానీ ఆ పరుగులో జీవితాన్నీ జీవితంలో అతి ముఖ్యమైన సెక్స్‌నూ కోల్పోతే ఎలా? ఒత్తిడే అన్ని సమస్యలకూ కారణం అనే తప్పుడు అభిప్రాయం నుంచి ముందు బయటపడాలి. ఒత్తిడి ఇప్పుడే పుట్టుకొచ్చిన సమస్య కాదు. తరాల నుంచి ఉంది. అప్పుడు కంప్యూటర్లు లేకపోవచ్చు, కాల్‌సెంటర్లు లేకపోవచ్చు. అప్పటి సమస్యలు అప్పుడున్నాయి. ఆ రోజుల్లో వైద్యం లేదు, విద్యుత్తు లేదు. మరీ వెనక్కి వెళ్తే గుహల్లో బతికారు. పులులూ సింహాలమధ్య భయంభయంగా గడిపారు. ఇవన్నీ సమస్యలేగా? అయినా ఆతరం వాటి గురించి ఆలోచిస్తూ జీవితాన్ని కోల్పోలేదు. ముఖ్యంగా సెక్స్‌కు దూరం కాలేదు. చక్కని శృంగార జీవితాన్ని అనుభవించారు. మరి మీకెందుకీ జడత్వం?' అంటూ ఈతరం భార్యాభర్తల్ని ప్రశ్నిస్తారు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సుధాకర్ కృష్ణమూర్తి. హైదరాబాద్‌కు చెందిన ఈ నిపుణుడు 'ఆరోగ్యానికి సెక్స్' అనే అంశంపై అంతర్జాతీయ వేదికలపై ఉపన్యాసాలిచ్చారు. 'మీచుట్టూ ఉన్న పరిస్థితుల్ని మీరు నియంత్రించలేకపోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలరు. మీ దృక్పథాల్ని మార్చుకోగలరు. మిమ్మల్ని భయపెడుతున్న ఒత్తిడిని ఆఫీసులోనే వదిలేసి వెళ్లండి. వ్యక్తిగత, వృత్తి జీవితాల మధ్య ఓ విభజన రేఖ గీసుకోండి. సెక్స్‌ను దూరం చేసుకోకండి. శృంగార జీవితంలో తృప్తిని అనుభవించిన వ్యక్తి వృత్తి జీవితంలోనూ విజయం సాధిస్తాడు. అతని కుటుంబమూ మానసిక శారీరక ఆరోగ్యాలతో కళకళలాడుతుంది. తద్వారా సమాజమూ దేశమూ బాగుపడుతుంది' అని సలహా ఇస్తారాయన.
శృంగారం... మనసుల భేటీ. తనువుల పోటీ! ఆ భేటీలో... ఇరు మనసులు మరింత దగ్గరవుతాయి. మనువుకు అర్థం అంతేగా! ఆ పోటీలో... ఇద్దరూ విజేతలవుతారు. 'ఆనందోబ్రహ్మ' అదేగా! నవతరం దంపతులారా... ఆ ఆనందానుభూతుల్ని దూరం చేసుకోకండి. పరుగుల జీవితంలో శృంగారం నిషిద్ధఫలం కాదు... సిద్ధాన్నం! నిండు
